బండి సంజయ్, అర్వింద్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు

By -  Knakam Karthik
Published on : 25 Jan 2026 8:28 AM IST

Telangana, Ktr, Phone Tapping Case, Bandi Sanjay, Dharmapuri Arvind

బండి సంజయ్, అర్వింద్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గానూ విడివిడిగా లీగల్ నోటీసులు జారీ చేశారు. నోటీసు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో, సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు.

తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా మాట్లాడటం నిజమైన రాజకీయాలకు విరుద్ధమని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేసు న్యాయస్థానంలో నడుస్తున్నప్పటికీ, చట్టవ్యతిరేకంగా మళ్లీ అదే తరహా ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని తెలిపారు.

ఈ మేరకు బండి సంజయ్, అరవింద్‌లకు కేటీఆర్ తన న్యాయవాదుల ద్వారా నోటీసులు పంపారు. బండి సంజయ్‌కు పంపిన నోటీసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ, మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని పేర్కొన్నారు.

మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్‌కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తీవ్రంగా తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు అక్షేపణీయమని నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు కృషి చేసిన మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, అటువంటి వ్యక్తిపై ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడటం రాజకీయ కక్ష సాధింపేనని వివరించారు. ఈ ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, కేటీఆర్‌కు బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో, సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Next Story