కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అసత్యాలు మాట్లాడారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మరొక ప్రజాప్రతినిధిపై అసత్యపూరిత ఆరోపణలు చేయడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
తన క్లయింట్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్‌కు లీగల్ నోటీసులో కేటీఆర్ న్యాయవాదులు పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ అడ్డగోలు అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తదుపరి లీగల్ నోటీసుతో పాటు చట్టంలో అందుబాటులో ఉన్న క్రిమినల్ చర్యలకు కూడా బండి సంజయ్ బాధ్యుడు అవుతారని అందులో పేర్కొన్నారు.