కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్

బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు.

By Medi Samrat
Published on : 3 Feb 2024 2:55 PM IST

కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్

బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని.. కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పార్టీ పైన బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతున్నదని... కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతుంది. దీంతో బీజేపీకి లాభం చేకూరుతుంది. ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని అన్నారు. నిజానికి బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నదని అభిప్రాయ‌ప‌డ్డారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రి వాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బీజేపీని అడ్డుకోగలరన్నారు.బీజేపీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు.

Next Story