హైదరాబాద్: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ ఊహలకు అందకుండా ఉన్నాయి. ఉద్యమ పార్టీకి లోక్ సభలో స్థానం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటును గెలవకపోవడంపై కేటీఆర్ స్పందించారు. ఈ ఫలితాలతో తాము డీలా పడ లేదని హుందాగా ప్రకటించారు కేటీఆర్. టీఆర్‌ఎస్ స్థాపించిన 24 ఏళ్లలో విజయాలు, ఎదురుదెబ్బలు అన్నీ చూశామన్నారు. తెలంగాణను సాధించడమే తమ అతిపెద్ద విజయమని అన్నారు.
2014లో 63/119, 2018లో 88/119 సీట్లు సాధించామని, ప్రస్తుతం 39 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. నేటి ఎన్నికల ఎదురుదెబ్బ కచ్చితంగా నిరాశపర్చిందని, కానీ తాము శ్రమిస్తూనే ఉంటామని, మళ్లీ గట్టిగా తిరిగొస్తామని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఫినిక్స్ పక్షిలాంటిది అని అన్నారు. ఫీనిక్స్ పక్షిలాగా తిరిగి పైకి లేవడం తమకు అలవాటేనన్నారు. ప్రాంతీయ పార్టీ అయిఉండి కూడా వరుసగా రెండు సార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చామని, మూడోసారి కూడా గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు సాధించామన్నారు.