అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? : అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేత‌ల రియాక్ష‌న్‌

అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాజ‌కీయ నాయ‌కులు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందిస్తూ.. జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని మండిప‌డ్డారు.

By Medi Samrat  Published on  13 Dec 2024 10:29 AM GMT
అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? : అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేత‌ల రియాక్ష‌న్‌

అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాజ‌కీయ నాయ‌కులు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందిస్తూ.. జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని మండిప‌డ్డారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ.. నిజంగా ఎవరు విఫలమయ్యారు? అని ప్ర‌శ్నించారు. @alluarjun గారూ ఒక సాధారణ నేరస్థుడిగా వ్యవహరించడం, ప్రత్యేకించి అతను ప్రత్యక్షంగా బాధ్యత వహించని విషయానికి అనడం లేదు. ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయటం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని హ‌రీష్ రావు అన్నారు. అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అని ప్ర‌శ్నించారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అన్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ ని ఎందుకు అరెస్టులు చేయరు? రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు? అని ప్ర‌శ్నించారు. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలన్నారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి? ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదన్నారు.

జాతీయ అవార్డు గ్రహీత, నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ డ్రెస్ మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా నేరుగా తన బెడ్‌రూమ్ నుంచి తీసుకెళ్లడం అవమానకరమైన చర్య అని పేర్కొన్నారు. ప్రముఖ హీరో విషయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ఒక స్టార్ హీరోకు పోలీసులు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ప్రశ్నించారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని, అయితే ఆ భారీ జనసందోహాన్ని కట్టడి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

Next Story