రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్

KTR Fires On Revanth Reddy. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  18 Sep 2021 11:23 AM GMT
రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్‌లో జరిగిన దళిత, గిరిజన దండోరా సభలో అన్నారు. వేలాది మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని.. కానీ కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. తెలంగాణలో 12 శాతం ఉన్న మాదిగలకు కేబినెట్‌లో స్థానం లేదని.. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తన కుమారుడినో, అల్లుడినో కేబినెట్ నుంచి తప్పించి ఆ స్థానంలో మాదిగలకు స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


గజ్వేల్‌లో సభ పెట్టామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోందని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలా మారిందని ఎద్దేవా చేశారు. మాణిక్కం ఠాకూర్ రూ. 50 కోట్లకు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవిని అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పీసీసీని కొనుగోలు చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు టిక్కెట్లు అమ్ముకునే ప్రయత్నం మొదలు పెట్టారని విమర్శించారు. ఇప్పటి నుంచే పార్టీకి మార్కెటింగ్ చేసుకొని ఎన్నికలప్పుడు టిక్కెట్లు అమ్ముకుంటారని ఆరోపించారు. ఇక ఎవరు ఎక్కువగా తిడితే వారికే యూట్యూబ్‌లో వ్యూస్ వస్తున్నాయని, నెగటీవ్ వార్తలకు ఎక్కువగా పబ్లిసిటీ వస్తోందని కేంద్ర మంత్రి గడ్కరీ కూడా అంటున్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కొందరు నేతలు ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా తిడుతున్నారని, నోరు ఉందికదా అని తిడితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

ఎక్కువ మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఎవరెవరి అక్రమ సంపాదన ఏంటో తమకు అన్నీ తెలుసునన్న కేటీఆర్.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పొగిడిన జాతీయ నాయకత్వాన్ని గాడిద అంటావు.. మరి నువ్వు అడ్డ గాడిదవా? నిలువు గాడిదవా? అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అవసరమైతే వీరిద్దరిపై దేశద్రోహం కింద తెలంగాణ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


Next Story