గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీపై తెగ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేనిది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ బీజేపీ నాయకులపైనా, కేంద్ర ప్రభుత్వం పైనా విరుచుకుపడ్డారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా బీజేపీపై విమర్శలకు దిగారు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజృంభించి బీజేపీని తరిమి కొట్టాలని కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రమే వరి కొనుగోలు చేయాలంటూ ఈనెల 12న ఆందోళనలు నిర్వహించి బీజేపీ మెడలు వంచే విధంగా ధర్నా చేయాలని ఆయన సూచించారు. కామారెడ్డిలో జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలన, సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధి పనుల్లో తెలంగాణ ముందంజలో ఉందని.. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేసీఆర్ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని.. కాంగ్రెస్, బీజేపీ, టిడిపి, వంటి ప్రధాన పార్టీలను గట్టిగా ఎదుర్కొన్న ఘనత ఆయనదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, కరెంట్ షాక్ లు, రైతు ఆత్మహత్యలు ఉండేవని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.