నీకేం పని ఏపీతో అంటున్నారు.. ఇదే నా సమాధానం : కేటీఆర్

KTR Fires On BJP. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఏపీకి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు

By Medi Samrat  Published on  12 March 2021 12:28 PM GMT
KTR Fires On BJP
విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఏపీకి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతు తెలుపుతామని వెల్లడించారు. ఏపీ వాళ్లు కూడా తెలంగాణకు మద్దతుగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రైవేట్‌పరం చేసేలా ఉన్నారని విమర్శించారు. అవసరమైతే కేసీఆర్‌ ఆనుమతితో వైజాగ్‌ వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతు తెలియజేస్తాం. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం.. మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు వస్తారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు.. రేపు బీహెచ్‌ఈఎల్‌ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు. ప్రైవేటీకరణకు అందరం వ్యతిరేకంగా ఉండాలని ఆయన సూచించారు. అయితే కొంత మంది ఆయన మద్దతు ఇవ్వడం పై పెదవి విరిచారు.


విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నీవెవరు అడిగేందుకు.. నీకేం పని ఏపీతో అంటున్నారని... ఆంధ్రప్రదేశ్‌ దేశంలో లేదా? మేం మాట్లాడొద్దా? అని ప్రశ్నించారు. దేశంలో మాకు భాగస్వామ్యం లేదా అని నిలదీశారు. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్ముతున్నారు... రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌పై కూడా పడుతారని మండిపడ్డారు.

ఏపీకి కష్టం వచ్చిందని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా? రేపు మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఉంటారు. ఎవరికో కష్టం వచ్చింది.. నాకెందుకులే అనుకుంటే సరికాదు. మొదట భారతీయులం తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాలి అని తెలిపారు.

విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులతో టి.ఆర్.ఎస్ ది పేగుబంధమని మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ బేగంపేట హరిత ప్లాజా హోటల్‌లో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో 'తెలంగాణ జీవితం-సామరస్య విలువలు' అనే సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


Next Story