కంగనా రనౌత్‌కు రాహుల్ ను విమర్శించే నైతిక హక్కు లేదంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దానం చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలను కించపరిచే విధంగా రాజకీయాలు ఉండకూడదని, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పట్ల దానం నాగేందర్ ఉపయోగించిన నీచమైన భాష ఆమోదయోగ్యం కాదని కేటీఆర్ అన్నారు. కంగనా రనౌత్ అభిప్రాయాలను, ఆమె పార్టీ ఐడియాలజీని తాను ఏకీభవించనప్పటికీ ఇలా దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదన్నారు. సోనియా గాంధీని అవమానించేలా హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి కంటే ముందే కేసీఆర్ ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. రాజకీయాలను పక్కనపెడితే నీతి, మర్యాదకు కట్టుబడి ఉంటామన్నారు కేటీఆర్. మీ పార్టీలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలని, పార్టీ కేడర్‌కు విలువలు నేర్పాలన్నారు కేటీఆర్.
గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో దానం నాగేందర్ మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో అలాంటి వేషాలు వేసే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదంటూ దానం వ్యాఖ్యానించారు.