కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై 'రోడ్ సేఫ్టీ సెస్' పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని, రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి, ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి రహదారుల భద్రతా ప్రమాణాలను పెంచాల్సిన బాధ్యతను విస్మరించి, అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలని చూడటం దారుణమన్నారు కేటీఆర్.
‘హైడ్రా’ వంటి తప్పుడు విధానాలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోవడానికే ఇలాంటి పన్నులు వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన గ్యారెంటీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజల నుంచి రూ. 270 కోట్లు ముక్కుపిండి వసూలు చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని, అప్పు చేసి వాహనాలు కొనే సామాన్యుల జేబులు కొట్టే ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.