జాతివివక్ష మానవత్వానికే గొడ్డలిపెట్టు..డెహ్రాడున్‌లో విద్యార్థి హత్యపై కేటీఆర్ ట్వీట్

డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఏంజెల్ చక్మా దారుణ హత్యపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

By -  Knakam Karthik
Published on : 31 Dec 2025 1:28 PM IST

Telangana, Ktr, Brs, Central Government, Dehradun, Student Murder, Racism

జాతివివక్ష మానవత్వానికే గొడ్డలిపెట్టు..డెహ్రాడున్‌లో విద్యార్థి హత్యపై కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: జాతివివక్ష అనేది మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘోరమైన నేరమని, ఇది భారత రాజ్యాంగ విలువలకే విఘాతమని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. జాతివివక్ష ఏ రూపంలో ఉన్నా దానిని సహించకూడదని ఆయన స్పష్టం చేశారు. డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఏంజెల్ చక్మా దారుణ హత్యను ప్రస్తావిస్తూ.. ఈ ఘటన పట్ల కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వివక్ష, అధికార దుర్వినియోగం కలిస్తే ఎంతటి ఘోరమైన పరిణామాలు ఎదురవుతాయో ఈ సంఘటన గుర్తు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నేరాలు కేవలం విడిగా జరిగిన సంఘటనలు కావని, ద్వేషాన్ని, వివక్షను సహించడం వల్ల కలిగే ముప్పుకు ఇవి ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు. "భారతదేశం ఇటువంటి విషాన్ని భరించలేదు," అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. "భిన్నత్వంలో ఏకత్వం అనే పునాదిపై నిర్మించబడిన మన దేశం, ఇలాంటి విద్వేషాలను భరిస్తూ మనుగడ సాగించలేదు. న్యాయం అందించడంలో ఎటువంటి రాజీ ఉండకూడదు. జాతివివక్ష అది ప్రత్యక్షంగా ఉన్నా లేదా పరోక్షంగా ఉన్నా.. దానిపై 'జెరో టాలరెన్స్' ( కఠిన వైఖరి) పాటించాలని కెటిఅర్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై నైతిక మరియు రాజ్యాంగపరమైన బాధ్యత ఉందని కేటీఆర్ గుర్తు చేశారు.

జాతి వివక్షతో కూడిన మాటలు, ప్రవర్తన మరియు రెచ్చగొట్టే చర్యలను నేరంగా పరిగణిస్తూ కఠినమైన, స్పష్టమైన చట్టాలను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణ అరెస్టులు, విచారణ మరియు శిక్షలు పడేలా చట్టంలో నిబంధనలు ఉండాలని కోరారు. "చట్టం తన పని తాను చేయాలి, బాధ్యత అనేది పక్షపాతంగా ఉండకూడదు," అని ఆయన నొక్కి చెప్పారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వం మరియు గౌరవాన్ని వాగ్దానం చేసిందని, జాతి వివక్ష నుండి పౌరులను రక్షించడం అనేది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదని, అది దేశం యొక్క మానవ హక్కుల నిబద్ధతకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. వివక్షను పెంచి పోషిస్తే అది వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది," అని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టకుండా.. ఇలాంటి నేరాలు మళ్లీ పునరావృతం కాకుండా కఠినమైన చట్టపరమైన రక్షణలు, పకడ్బందీ అమలు చేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరారు.

Next Story