ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు
KTR criticizes PM Modi's comments. తెలంగాణ పర్యటనలో కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 8 July 2023 11:14 AM GMTతెలంగాణ పర్యటనలో కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..! ఈ విమర్శలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ మా కుటుంబం.. రాష్ట్ర ప్రజలు మా కుటుంబ సభ్యులు. వారి అభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం, అసత్యాలు మాట్లాడటం మోదీకి అలవాటుగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. 9 ఏళ్లలో యువత కోసం చేసిన ఒక్క మంచిపనైనా ప్రజలకు చెప్పి ఉంటే బాగుండేదని కేటీఆర్ అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల 45 ఏళ్ల కల. గుజరాత్‌కు ప్రధాని రూ.20వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చారు. ఇక్కడ రూ.520 కోట్లతో రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అవుతుందని కేటీఆర్ అన్నారు.
దేశ చరిత్రలోకే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీ అని.. కేంద్రం పరిధిలో 16 లక్షల ఖాళీలను మోదీ భర్తీ చేయలేదని అన్నారు. తెలంగాణలో 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపిన తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. బిల్లులను ఆమోదించకుండా వర్సిటీల్లో ఖాళీల భర్తీని గవర్నర్ ఆపుతున్నారని, బిల్లులను అడ్డుకుంటున్న గవర్నర్‌కు ప్రధాని మోదీ ఒక మాట చెబితే బాగుండేదని అన్నారు. నల్ల చట్టాలతో 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్న ప్రధాని వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ఏజెన్సీల బూచిని చూపించి ప్రధాని చేసిన హెచ్చరికలకు మేం భయపడబోమని కేటీఆర్ అన్నారు.