హంగ్ రావాలని కోరుకుంటున్న కేటీఆర్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు ఏవీ మెజారిటీ సాధించకూడదని ఆశిస్తున్నామని.. అలా జరిగితే జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

By Medi Samrat  Published on  12 April 2024 6:00 PM IST
హంగ్ రావాలని కోరుకుంటున్న కేటీఆర్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు ఏవీ మెజారిటీ సాధించకూడదని ఆశిస్తున్నామని.. అలా జరిగితే జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ వచ్చే వకాశం ఉంది... NDA లేదా ఇండియా కూటమి స్పష్టమైన మెజారిటీని సాధించలేవు. గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలిస్తే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తామని కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల జీవితాలను ఛిద్రం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఘోరంగా విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. బండి సంజయ్ మోదీని దేవుడని పిలుస్తారని.. తెలంగాణకు నరేంద్ర మోదీ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల లేదా వైద్య కళాశాల మంజూరు చేయని బీజేపీ అభ్యర్థులను ఎన్నుకుంటామా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బాగా అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించామని.. కానీ వారి నిర్ణయాల వల్ల తెలంగాణలోని రియలెస్టేట్ కంపెనీలు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నాయని అన్నారు. మహేశ్వరంలో ఫార్మా సిటీ సిద్ధంగా ఉంది.. కానీ దాన్ని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. తప్పుడు వాగ్దానాలతో ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత మహిళలకు ఉచిత బస్సు సర్వీసు పథకాన్ని రద్దు చేస్తుందని కేటీఆర్ అన్నారు.

Next Story