బీఆర్ఎస్ పార్టీ రేపో మాపో మూతబడే దుకాణమని, ఆ పార్టీ నాయకుల గురించి మాట్లాడి వేస్ట్ అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో కేటీఆర్ మీటింగ్‌కు పల్లీలు, ఐస్ క్రీమ్‌లు అమ్ముకునే వారు వచ్చేంత మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. నల్గొండలో ఐటీ హబ్‌కు తాళం వేసిందే కేటీఆర్ అని.. హరీష్‌రావు, కేటీఆర్ తన కాలి గోటికి కూడా సరిపోరంటూ మంత్రి కోమటిరెడ్ది వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ మాదిరి తనపై అవినీతి ఆరోపణలు లేవని, అటు కేసీఆర్ మాదిరి ఎలక్షన్, కలెక్షన్ చేయలేదని ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్‌తో కత్తులతో పొడుచుకుంటున్నారని విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ బెటర్ అని, ఆయన జైల్లో ఉంటే తన కొడుకు పార్టీని నిలబెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని కోమటిరెడ్ది వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సారి బడ్జెట్ సెషన్‌కు కేసీఆర్ వస్తారో రారో చెప్పాలంటూ మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాకవి గద్దర్‌కు పద్మ అవార్డు ఇస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా? బండి సంజయ్ ఉన్నాడా అంటూ ప్రశ్నించారు.