తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం జల వివాదం నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా జలాలు అందిస్తామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరగనివ్వమని ఆయన అన్నారు. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ జల వివాదం పై వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటా ను సాధించుకుంటామని అన్నారు.
నారాయణ పేట జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఆసుపత్రిని ప్రారంభించి మరొక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న కేటీఆర్ కాన్వాయ్ ని ఏవీబీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు ఎబివిపి కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. మంత్రి పర్యటనలో అకస్మాత్తుగా కాన్వాయ్‌ని ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక్కసారిగా కేటీఆర్ కాన్వాయ్ మీదకి దూసుకురావడంతో ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.