కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొన్నిరోజుల క్రితం రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆయన పొంగులేటితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజగోపాల్ రెడ్డి ఘర్‌వాపసీ అవుతారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పొంగులేటితో సమావేశం కావడం కీలకంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఏడాది కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా లేదని, బీఆర్ఎస్‌పై పోరాటం చేసే పరిస్థితుల్లో లేదని, జాతీయ నాయకత్వం కూడా బలహీనపడిందని అన్నారు. కేసీఆర్ ను ఓడించడం బీజేపీకే సాధ్యమని అన్నారు. తాను బాధతోనే కాంగ్రెస్ ను వీడుతున్నట్లు చెప్పారు.
మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన బీజేపీని వీడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.