నామినేషన్ దాఖలు చేసిన రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy Files Nominations. మునుగోడు ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికకు
By Medi Samrat Published on 10 Oct 2022 6:43 PM ISTమునుగోడు ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్డీయే ప్రభుత్వం నుంచి 18,000 కోట్ల విలువైన మైనింగ్ కాంట్రాక్టు అందుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అక్టోబరు 10న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజగోపాల్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తదితర నేతలు ఉన్నారు.
నామినేషన్ సమర్పించిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్తును మునుగోడు ఉప ఎన్నిక నిర్దేశిస్తుందని అన్నారు. మునుగోడులో తనపై ఎవరు పోటీకి వస్తారో రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా?.. ఎవరొచ్చినా విజయం నాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. "లక్షల కోట్ల మేర ప్రజల సొమ్ము దోచుకున్న మిమ్మల్ని వదిలేది లేదని.. వచ్చే ఏడాది బతుకమ్మ నాటికి కవిత జైలుకెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ 3న జరగనుండగా.. 6న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ తరుపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు.