హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం సూచించారు. వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలపైన అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.