కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిషన్ గడువును ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కమిషన్‌ను నియమించింది. 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వస్తున్నది. నివేదిక సిద్ధం కాకపోవడంతో గడువును మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఇప్పటికే ఆయా బరాజ్‌ల నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లు, ఏజెన్సీల ప్రతినిధులను విచారించింది. ప్రస్తుతం విజిలెన్స్, ఎన్‌డీఎస్‌ఏ నివేదికలను అధ్యయనం చేస్తుండడంతోపాటు మరికొంతమందిని విచారించే అవకాశం ఉంది.
అయితే ఈ విచారణ కమిషన్‌కు నేతృత్వం వహిస్తోన్న జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా, రెండు వారాల పాటు హైదరాబాద్‌లోని ఉండనున్నారు. విచారణలో భాగంగా పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్‌పై నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వానికి కమిషన్ ఫైనల్ రిపోర్టును ఇవ్వనుంది. అయితే ఈ నెల 31వ తేదీతో కమిషన్ గడువు ముగియనుండగా... మళ్లీ గడువు పెంపు లేకుండా ఆలోపే రిపోర్టు సమర్పించాలనే ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు సమాచారం.