హైదరాబాద్ గాంధీభవన్‌లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ హాజరుకావడంపై మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కీలక సమావేశానికి ఎలా వస్తాడంటూ సమావేశాన్ని జీవన్‌రెడ్డి బహిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ వారిని మీటింగ్‌లో పక్కన కూర్చోబెడితే ఎలా కూర్చుంటాం..అని జీవన్ రెడ్డి అన్నారు.
పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ విచారణలో అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఎలా పిలిచారంటూ జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలా అయితే అంతర్గత సమావేశంలో ఎలా చర్చించుకుంటాం అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ కావాలని అడుగుతుంటే, దశాబ్దకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. నేను నిన్నటి వరకు సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై, అతను చేస్తున్న అక్రమాలపై పోరాటం చేస్తున్నాను, ఇక్కడేమో అతనిని మీటింగ్‌లో కూర్చోబెట్టారు. పదేళ్లలో బీఆర్ఎస్‌పై పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఏమని సమాధానం చెప్తాం..అని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.