ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయి 420 రోజులవుతుంది: మాజీ మంత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయి 420 రోజులు అవుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 3:43 PM IST
ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయి 420 రోజులవుతుంది: మాజీ మంత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయి 420 రోజులు అవుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను ప్రతి రోజు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని, ప్రజా పాలనలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజ్యాంగ విలువలను పట్టించుకోకుండా.. రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని.. రాజకీయాలు మాట్లాడకూడని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఏమో రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీ ఆశయాలకు వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తుందని విమర్శించారు.
రాష్ట్రంలో వివిధ రకాల పంటలు పండించిన రైతులు, మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేసీఆర్ హయాంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు భరోసా రాక, రుణమాఫీ జరగక నిస్పృహకు గురైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై రాష్ట్ర పర్యటన చేశామన్న ఆయన, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించి, కొంత ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. మేము రైతులను పరామర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి అక్కసు ఎందుకో అర్థం కావడంలేదని.. నిరంజన్ రెడ్డి అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అనుమతి లేదన్నారని ఆరోపించారు.