మే 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా చీఫ్ షేక్ మున్నా బాషా మహబూబ్ నగర్ స్థానం నుండి.. తన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఏప్రిల్ 19న సైలెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చల్లా వంశీచంద్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, డీకే అరుణ లను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు నిలబెట్టాయి. ఈసారి AIMIM అక్కడ పోటీ చేయాలని అనుకుంటే పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
ఈ పార్లమెంటరీ స్థానంలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్‌నగర్ ఉన్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు చాలా కీలకం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్‌రెడ్డి డీకే అరుణపై విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోనని ఓ సస్పెన్స్ నడుస్తూ ఉంది.