ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ, ఏసీబీ విచారణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని అందులో రాసుకొచ్చారు. తనపై కేసు పెట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జైలుకు పంపించాయని రాజాసింగ్ అన్నారు. ఆ గేమ్ ఇప్పుడు ప్రారంభమైందని ట్వీట్ చేశారు. జైలుకు వెళ్లే ముందు కొన్ని వస్తువులు తీసుకెళ్లండని కేటీఆర్‌కు గోషామహల్ ఎమ్మెల్యే సూచించారు. ఇప్పుడా ఆ ట్వీట్ కాస్త చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ హయాంలో తనను అక్రమంగా జైల్లో పెట్టారని, ఇప్పుడు మీకు కూడా అదే గతి పట్టబోతుందని ఎక్స్ వేదికగా రాజాసింగ్ ట్వీట్ చేశారు. జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు (కటకటాల వెనుక కూడా ఫ్యాషన్ కీలకం), ఒక హాయిగా ఉండే వెచ్చని దుప్పటి, టవల్(జెల్లో కూడా పరిశుభ్రత ముఖ్యం), కర్చీఫ్(భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు), సబ్బులు(ఆ "క్లీన్ ఇమేజ్"ని కొనసాగించడానికి), ఒక ప్యాకెట్ ఊరగాయ(ఎందుకంటే జైలు భోజనం ఫైవ్ స్టార్ కాదు) తీసుకెళ్లండని కేటీఆర్ కు సూచించారు.
అలాగే ఇప్పుడుంది చలికాలం కాబట్టి ఓ వెచ్చని స్వెటర్ కూడా తీసుకెళ్లాలని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు చెప్పారు. కర్మ ఎవరినీ ఊరికే వదిలిపెట్టదు.. అది సరైన టైం కోసం ఎదురుస్తుంది అంతే అని ఆయన ట్వీట్ లో రాశారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతరులను టార్గెట్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందో మీరు కూడా రుచి చూస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్వీట్‌లో రాశారు.