Hyderabad: టీజీపీఎస్సీ ముట్టడికి యత్నం.. బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్
బీఆర్‌ఎస్‌వీ సంఘం జూలై 5 శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయాన్ని ముట్టడించింది.
By అంజి Published on 5 July 2024 7:14 AM GMTHyderabad: టీజీపీఎస్సీ ముట్టడికి యత్నం.. బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్
హైదరాబాద్: నిరుద్యోగ జేఏసీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అనుబంధ విద్యార్థి సంఘం భారత రాష్ట్ర సమితి విద్యార్థి (బీఆర్‌ఎస్‌వీ) సంఘం జూలై 5 శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయాన్ని ముట్టడించింది. ఈ క్రమంలోనే అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేస్తూ ముట్టడి చేసేందుకు ప్రయత్నించారు. గ్రూప్ 2,3 పోస్టుల పెంపుదలతోపాటు డిసెంబర్‌లో పరీక్ష నిర్వహించాలని, డీఎస్సీని 3 నెలల పాటు అక్టోబర్‌కు వాయిదా వేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఈ నిరసనలో బీఆర్‌ఎస్‌వీ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టీ హరీష్ రావు.. అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు. "ప్రజా పాలన అని పిలవబడే" తెలంగాణలో విద్యార్థులు తమ నిరసన గొంతును వినిపించొద్దా అని ప్రశ్నించారు.
''హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టిజిపిఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని హరీష్ రావు పేర్కొన్నారు. సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా? అని ప్రశ్నించారు.
''ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ, నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు పాల్పడుతున్నది రేవంత్ సర్కారు. ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు. 'అప్రజాస్వామ్యపాలన'. ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థికి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు నిరుద్యోగులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు'' అని అన్నారు.
హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగాటిజిపిఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.… pic.twitter.com/hVqe9yXup3
— Harish Rao Thanneeru (@BRSHarish) July 5, 2024
''సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టం. విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతాం. నిర్విరామ పోరాటం చేస్తాం. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి అని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం'' అని హరీష్ రావు అన్నారు.