బీజేపీ కార్యకర్తలను చంపించిన గద్దర్‌కు పద్మ అవార్డులు ఎలా ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇద్దరికి మాత్రమే పద్మ పురస్కారాలు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంపై బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదని, అర్హులకే మాత్రమే అవార్డులు ప్రదానం చేస్తుందని అన్నారు. ఇదే సమయంలో గద్దర్ పేరును ప్రస్తావిస్తూ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.
పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికి ఇస్తామని, గద్దర్‌కు ఎలా ఇస్తాం? ఆయన భావజాలం ఏంటి? బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తామని అన్నారు. తమ కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారని, మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తామని.. బరా బర్ ఇవ్వమంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సెంటిమెంట్ రగిలించి లబ్ధి పొందింది ఎవరూ రాష్ట్ర ప్రజలకు తెలుసని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా తెలంగాణ రాష్ట్రానికి కేవలం రెండు పద్మ పురస్కారాలే దక్కాయంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తోనం్న వేళ బండి సంజయ్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.