హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించిన వ్యవహారం తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ ఇంజినీర్-ఇన్-చీఫ్ ఎస్‌కే జోషి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కలిపి విచారించింది. కేసీఆర్, హరీష్ రావ్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.
ఇప్పటికే ప్రభుత్వం ఈ పిటిషన్లపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి ప్రతిగా పిటిషనర్లు రిప్లయ్‌ను ఫైల్ చేశారు. పిటిషనర్ల రిప్లయ్‌పై ప్రభుత్వం తరపున లిఖితపూర్వక సబ్మిషన్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈ మేరకు హైకోర్టు స్పందిస్తూ ఫిబ్రవరి 20లోపు ప్రభుత్వ లిఖితపూర్వక సబ్మిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసిన హైకోర్టు, అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం చేపట్టే చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయ్యింది.