దంచికొడుతున్న వర్షాలు.. మరో మూడు రోజులూ..!

Heavy rains in Telangana for another three days. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

By అంజి  Published on  8 July 2022 2:34 PM IST
దంచికొడుతున్న వర్షాలు.. మరో మూడు రోజులూ..!

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ముఖ్యంగా నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మిగతా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మరో వైపు గత మూడు రోజులుగా రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు పట్టణాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఇక పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు వరద నీటితో పొర్లుతున్నాయి. చెరువులు కూడా నిండుతున్నాయి.

భారీ వర్షాల కారణంగా నల్గొండ, ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణాల్లోని పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు బయటకు వెళ్లలేకపోతున్నారు. గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు రామగుండం, ఇల్లందు ఓపెన్ కాస్ట్‌ల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం ఓపెన్ కాస్ట్‌ల్లోకి వరద నీరు చేరడంతో పనులకు అంతరాయం కలిగింది. ఇల్లందు కోయగూడెం ఓసీలో కార్మికుల నివాస సముదాయాలు నీట మునిగాయి. బురద కారణంగా బొగ్గు తరలించే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

Next Story