బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణలో తనతో పాటు న్యాయవాది ఉండాలంటూ కేటీఆర్ కోరారు. అయితే కేటీఆర్‌తో పాటు లాయర్ ఉండేందుకు హైకోర్టు నిరాకరించింది.
విచారణ సమయంలో లాయర్‌తో కలిసి కూర్చునే అవకాశం లేదని, సీసీటీవీ పర్యవేక్షణ లేదా కేటీఆర్ కనిపించేంత దూరంలో న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇచ్చింది. గురువారం కేటీఆర్ ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణపై అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టుకు రావొచ్చని తెలిపింది.