ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'రైతు ద్రోహి'గా మారారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు పంటలకు రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఉన్న రైతుబంధును కూడా ఎగ్గొట్టారని ఆయన విమర్శించారు. "ముఖ్యమంత్రి మాట్లాడే బూతులు రైతుల కడుపు నింపవు.. ఆ బూతులు ఆపి సకాలంలో రైతుబంధు, యూరియా అందించండి" అని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తాజాగా ప్రకటించిన "99 రోజుల ప్రణాళిక" ఒక కొత్త డ్రామా అని హరీశ్ రావు కొట్టిపారేశారు. గ్రామాల్లోకి వెళ్లి మహిళలకు నెలకు ఇవ్వాల్సిన రూ. 2,500 ఎగ్గొట్టానని చెబుతారా? లేక రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, యూరియా దొరకకుండా ఇబ్బంది పెట్టానని చెబుతారా? అని ప్రశ్నించారు. పోలీసుల భద్రత లేకుండా జనాల్లోకి వస్తే, రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు. రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం ఆపి, వెంటనే పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని ఆయన స్పష్టం చేశారు.