కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారు
Harish Rao Presentation on Growth Rate of Telangana. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేసిన
By Medi Samrat Published on 23 Aug 2021 3:39 PM ISTతెలంగాణ రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేసిన విమర్శలను తెలంగాణ ఆర్థిక మంత్రి టీ. హరీష్ రావు కొట్టిపారేశారు. తెలంగాణ రాష్ట్రం తమ ప్రభుత్వ పాలనలో ఆర్థికవృద్ధి సాధిస్తోందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో భారత ఆర్థిక వృద్ధి బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉందని విమర్శించారు. భారత్ తలసరి ఆదాయం కంటే బంగ్లాదేశ్ తలసరి ఆదాయమే ఎక్కువని.. తెలంగాణ మాత్రం ఆర్థిక వృద్ధిని సాధిస్తూ దూసుకుపోతోందని తెలిపారు.
రాష్ట్రం 11.7 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసిందని, తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించిందని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632గా ఉందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే 1.84 రెట్లు ఎక్కువ అని తెలిపారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం అధికంగా ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గత ఏడేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. ఆరేళ్లలో దేశం 8 శాతం వృద్ధి రేటు సాధించిందని, దేశం కంటే తెలంగాణ 3 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాల వల్లే వృద్ధి రేటు సాధ్యమైందని ఆయన తెలిపారు.
కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కేంద్రం పనితీరు కన్నా తెలంగాణ రాష్ట్రం పనితీరు మెరుగ్గా ఉందని, ఈ విషయాన్ని కిషన్ రెడ్డి అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే తాను మాట్లాడుతున్నామని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి పెరుగుతూ పోతుంటే భారతదేశం ఆర్థికాభివృద్ది తగ్గుతూపోతోందని ఆయన అన్నారు. క్లిష్ట సమయాల్లో కూడా వృద్ధిరేటులో సానుకూల ప్రగతి సాధించామని ఆయన చెప్పారు. గత ఆరేళ్లలో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కన్నా తెలంగాణ వృద్ధి రేటు అధికంగా ఉందని, తాము నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని ఆయన చెప్పారు. తలసరి ఆదాయంలో ఏడేళ్ల క్రితం తెలంగాణ 10వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. తలసరి ఆదాయంలో గత ఏడేళ్లలో ఏడు రాష్ట్రాలను తెలంగాణ అధిగమించిందన్నారు.