మేడ్చల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలీసుల తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అధికార పార్టీ ఆదేశాలతో పనిచేస్తూ ఎక్స్‌ట్రాలు చేస్తున్న అధికారుల పట్ల భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
“రెండేళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అప్పుడు నేనే మంత్రిగా ఉంటాను. నిబంధనలు దాటి పనిచేసిన ప్రతి ఒక్కరి నట్లు–బోల్టులు ఫిట్ చేస్తాను. జాగ్రత్తగా ఉండాలి” అంటూ హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మర్యాదగా వ్యవహరించిన వారికి మర్యాదగా, మంచిగా పనిచేసిన వారికి మంచిగానే ఉంటుందని పేర్కొన్న ఆయన, అన్యాయానికి పాల్పడితే మాత్రం దేనికైనా సిద్ధమేనని హెచ్చరించారు. “మర్యాదకు మర్యాద, మంచికి మంచి. కానీ తేడా వస్తే ఖబడ్దార్” అంటూ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు.
ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు పనిచేస్తున్నారంటూ హరీష్ రావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ తటస్థంగా ఉండాలని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో బాధ్యత తప్పదని ఆయన స్పష్టం చేశారు.