ఈటలపై ఫైర్ అయిన మంత్రి హరీశ్ రావు

Harish Rao Fire On Etela Rajendar. టీఆర్ఎస్‌ను వీడుతూ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ త‌న‌పై చేసిన‌ వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి హరీశ్ రావు

By Medi Samrat  Published on  5 Jun 2021 1:42 PM GMT
ఈటలపై ఫైర్ అయిన మంత్రి హరీశ్ రావు

టీఆర్ఎస్‌ను వీడుతూ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ త‌న‌పై చేసిన‌ వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి హరీశ్ రావు స్పందించారు. కేసీఆర్‌ తనకు మార్గదర్శి అని.. తండ్రి కంటే ఎక్కువ అని.. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌లోనే ఉంటానన్నారు. ఈటల రాజేంద‌ర్‌ పార్టీని వీడటానికి అనేక కారణాలు ఉండొచ్చని, పార్టీలో ఉండాలా.. పోవాలా అన్నది ఆయన ఇష్టమన్నారు. ఈటల పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకిచ్చింది ఎక్కువని పేర్కొన్నారు. తన భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకోవడం విఫలప్రయత్నమని విమర్శించారు.

ఈటల పార్టీని వీడినా టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదన్నారు. తనకు పార్టీ ప్రయోజనాలే పరమావధి అని, నాయకత్వం ఏ పని అప్పగించినా పూర్తి చేయడం తన విధి అన్నారు. తన గొడవలకు నైతిక బలం కోసం పదేపదే నా పేరు ప్రస్తావించడం.. ఈటల భావదారిద్ర్యానికి నిదర్శనమ‌ని.. తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు ఈటల వైఖరి ఉందని అంటూ హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలావుంటే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్ర‌వారం నాడు టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ శామీర్‌పేటలోని త‌న‌ నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటెల‌ రాజేందర్ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్లనుండి కేసీఆర్‌తో సఖ్యత లేదని.. నాలాగే హరీష్ రావు ను కూడా ఎన్నోసార్లు అవమానించారని అన్నారు. కవిత ఎన్నికల్లో ఓడిపోయిందని.. తాను ఎప్పుడు ఓడిపోలేద‌ని.. సొంత కుటుంబం కోసం మాలాంటి వాళ్ళను అణచివేస్తున్నారని అది ప్రగతి భవన్ కాదని.. అది బానిస భవన్ అని కేసీఆర్‌పై మండిప‌డ్డారు.



Next Story