జయశంకర్ వర్సిటీలో పేపర్ లీక్‌..సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి నిదర్శనం..అని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.

By -  Knakam Karthik
Published on : 9 Jan 2026 10:11 AM IST

Telangana, Hyderabad, Jayashankar University, Harish Rao, CM Revanth, Congress Government, Brs

జయశంకర్ వర్సిటీలో పేపర్ లీక్‌..సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి నిదర్శనం..అని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ ఖాతాలో సీఎం రేవంత్‌పై విమర్శలు చేశారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పరీక్షా పత్రాల లీక్ ఘటన, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగాని తనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చేస్తోంది. మొన్నటి పీజీ వైద్య విద్య పరీక్షల్లో బయటపడిన మెడికల్ స్కాం ఇంకా మరువకముందే, ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా ముందుగానే లీక్ చేసి, AI పెన్‌లతో రాసిన మోడరన్ స్కాం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది..అని హరీశ్ రావు పేర్కొన్నారు.

ఇంత బహిరంగంగా, అక్రమంగా పరీక్షలు జరుగుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రలో మునిగి ఉంది? మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేళ్ల వ్యవధిలోనే స్కాంలకు చిరునామాగా మారడం దురదృష్టకరం. చివరకు విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి, రేవంతు రెడ్డి విలువల్లేని తనానికి నిదర్శనం...అని విమర్శించారు.

మహాకవి శ్రీశ్రీ "కాదేదీ కవితకు అనర్హం" అని చెప్పారు... కానీ రేవంత్ రెడ్డి "కాదేదీ స్కాంకు అనర్హం" అని చెప్పడమే కాకుండా, చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాదు, పరీక్షలను సక్రమంగా నిర్వహించడం చేతకాదు..ఇది రేవంత్ మార్క్ ప్రభుత్వ వైఫల్యం. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని బీఆర్ఎస్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

Next Story