ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నందుకు తెలంగాణ ప్రజలు సంతోషిస్తున్నప్పుడు.. దాని గురించి ప్రధాని కలత చెందారని.. అభివృద్ధిలో గుజరాత్‌ను తెలంగాణ వెనక్కి నెట్టివేస్తోందని భయపడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు హామీలను నెరవేర్చకుండా తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీయేనని మంత్రి ఆరోపించారు. 'ఒక ఓటు రెండు రాష్ట్రాలు' అంటూ బీజేపీ నినాదాలు చేసిందని.. 1999లో కాకినాడలో.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని తీర్మానం చేసిందని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ను విభజించడంలో కాంగ్రెస్ అహంకారంతో వ్యవహరించిందని మోదీ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సజావుగా రూపొందించకుండా బీజేపీని అడ్డుకోవడం ఏమిటని హరీష్ రావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీ కాదా అని ప్రధానిని నిలదీసిన ఆయన.. విభజన ప్రక్రియ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రధాని చేసిన వ్యాఖ్యను దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం రాత్రికి రాత్రే.. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిందని గుర్తు చేశారు.