హన్మకొండ జిల్లా దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామం వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఒక కారు నియంత్రణ కోల్పోయి, 38 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
బస్సు డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
అదృష్టవశాత్తూ బస్సులో ఉన్న విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.