తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో కలకలం రేపింది. ఎమ్మెల్యే, ఎంపీలు సూచించిన విధంగా అధ్యక్షుల ఎంపిక జరగకపోవడంతో కీలక నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షుల నియామకాలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కమలం పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.
హైదరాబాద్‌కు సంబంధించి గోల్కొండ జిల్లా అధ్యక్షుడి నియామకంపై తాను చెప్పిన వారికి కాకుండా వేరే వారి పేరు ప్రకటించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఒక మంచి కార్యకర్త పేరు పంపిస్తే దాన్ని పక్కనపెట్టడం ఏమిటని పార్టీ హైకమాండ్‌ను ప్రశ్నించారు. పార్టీకి తన అవసరం లేదని తాను అనుకుంటున్నానని.. మునుముందు బలం ఏమిటో చూపెడుతామని ఆడియో విడుదల చేశారు.
ఈ నేపథ్యంలోనే తాను సపోర్ట్ చేసిన నేతకు గోల్కొండ- గోషామహల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని రాజాసింగ్ కామెంట్ చేశారు. పార్టీకి తన అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు.