రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

రేషన్‌ షాపుల్లో ఉచిత బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు.

By -  Medi Samrat
Published on : 23 Jan 2026 8:11 AM IST

రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

రేషన్‌ షాపుల్లో ఉచిత బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినట్లుగానే నిత్యావసరాలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మరోవైపు 2025-26 వానాకాలం సీజన్‌లో 71.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు.

ఖరీఫ్‌ ధాన్యం సేకరణ పూర్తయిన నేపథ్యంలో పౌర సరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో గురువారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. ధాన్యం సేకరణలో సమస్యలను అధిగమించటానికి పలు మార్గదర్శకాలతో కూడిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడారు. పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సన్న బియ్యం పంపిణీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 14.21 లక్షల మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి.. వారి ఖాతాల్లో రూ. 17,018 కోట్లను జమ చేసినట్లు మంత్రి వివరించారు. దీనికి అదనంగా సన్న బియ్యం పండించిన రైతులకు క్వింటాకు రూ. 500 బోనస్ చొప్పున ఇప్పటివరకు రూ. 1,425 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. నల్గొండ, కామారెడ్డి తర్వాతి స్థానాల్లో నిలిచాయన్నారు.

Next Story