హైదరాబాద్ ను బేస్ చేసుకొని అల్లర్లు సృష్టించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి పుష్పలీల హెచ్చరించారు. గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ అక్రమాలు చేసిన నాయకులను కేసీఆర్ విదేశాలలో పెట్టి ఇక్కడికి రానియ్యకుండా అడ్డుకుంటుండని ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ లో ఆయనను కూడా అరెస్ట్ చేస్తారని కేసీఆర్ కు భయం పట్టుకుందని అన్నారు. కూతురు కవిత కూడా నాకు భయం అవుతుందని జైల్లో ఏడ్చిందని వాళ్ళ నాయకులే చెప్తున్నారని అన్నారు.
నన్ను ప్రధాన మంత్రిని చెయ్యమని కాళ్ళు మొక్కి మోదీ అధికారంలోకి వచ్చారని.. దమ్ముంటే ఈవీఎంలు తీసేసి ఎన్నికలకు వెళ్ళమని రాహుల్ గాంధీ చెప్పారు.. కానీ మోదీకి ఆ ధైర్యం లేదు, ఈవీఎంలను నమ్ముకొని గెలిచారని అన్నారు. ఉక్రెయిన్ ప్రధాని ఈవీఎంల తో అత్యంత ప్రమాదం అని చెప్పారు. చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి ఓడిపోవడానికి ఈవీఎం కారణమని చెప్పి మరీ ప్రూవ్ కూడా చేశారని ఉదహరించారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.