జాబ్ క్యాలెండర్‌కు బదులు రేవంత్‌ స్కామ్ క్యాలెండర్ తెచ్చారు: హరీశ్‌రావు

సింగరేణి స్కామ్‌కు బాధ్యులు ఎవరో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి..అని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు

By -  Knakam Karthik
Published on : 25 Jan 2026 1:30 PM IST

Telangana, Harish rao, Congress Government, Brs, Singareni Tenders Scam, Cm Revanthreddy, Bhatti Vikramarka

జాబ్ క్యాలెండర్‌కు బదులు రేవంత్‌ స్కామ్ క్యాలెండర్ తెచ్చారు: హరీశ్‌రావు

హైదరాబాద్: సింగరేణి స్కామ్‌కు బాధ్యులు ఎవరో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి..అని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్‌ను బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి ప్రయత్నం చేశారని, లబ్ధిదారులు ఎవరో భట్టి స్పష్టం చేయాలని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన బావమరిదికి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు.

సింగరేణి ప్రజల ఆస్తి, ఏ ఒక్కరికో సంబంధించినది కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుందని..హరీశ్ రావు అన్నారు. ఓబీ వర్క్‌కు బీఆర్ఎస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? 2025-2026లో మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికేట్ ను తీసుకువచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చిందా లేదా భట్టి చెప్పాలి..అని హరీశ్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూపాలపల్లిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా టెండర్లు పిలిచారు. 2025 మేలో ఓబీ వర్క్స్ లో సైట్ విజిట్ సర్టిఫికేట్ తెచ్చారు. దాని మొదటి లబ్ధిదారుడు రేవంత్ రెడ్డి బామ్మర్ధి సృజన్ రెడ్డి,శోదా కన్స్ట్రక్షన్స్. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానంలో అవినీతి జరుగుతోంది. నైనీ బొగ్గు బ్లాకు టెండర్లు మాత్రమే కాదు అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2025 మే నుంచి ఎంతమందికి సైట్ విజిట్ సర్టిఫికేట్లు ఇచ్చారో భట్టి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. చాలామందికి సైట్ విజిట్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు.అనేక కంపెనీలు సింగరేణికి మెయిల్స్ పంపారు. ఎన్ని మెయిల్స్ సింగరేణికి వచ్చాయో భట్టి బయటపెట్టాలి..అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి అన్ని ఆధారాలు ఇస్తాను. అన్ని ఫోటోలు నా దగ్గర ఉన్నాయి.సమయం వచ్చినప్పుడు అన్ని రిలీజ్ చేస్తాను. సింగరేణిలో పదుల సంఖ్యలో అవినీతి జరుగుతోంది. నేను రెండు మాత్రమే బయటపెట్టాను. సింగరేణి సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం లోపభూయిష్టంగా ఉందని అధికారుల మీటింగ్ లో చర్చ జరిగిందా లేదా...? సింగరేణిలో కాంట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలు చేసే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు?సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి రోజురోజుకు తగ్గిపోతుంది. బొగ్గు అమ్మకం తగ్గింది. మీ స్కామ్,అవినీతి వలన సింగరేణిపై ప్రభావం పడుతోంది. రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ కు బదులుగా స్కామ్ క్యాలెండర్ తెచ్చారు, కుంభకోణాలకు రేవంత్ రెడ్డి పాలన కేరాఫ్ అడ్రస్..అని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు.

Next Story