మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించింది. హైదర్‌షాకోట్‌లో బాధితుల ఇళ్లను నేతలు పరిశీలించారు. అనంతరం వారితో ఇంటరాక్ట్ అయ్యారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహకంలో చాలా ఇళ్లకు అనుమతులు ఇచ్చారని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి? అని ప్రశ్నించారు.
కొడంగల్‌లో సీఎం రేవంత్, సోదరుడి ఇళ్లు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయని, వాటిని ఎందుకు కూల్చరు? అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ది ఆపన్న హస్తం కాదని.. భస్మాసుర హస్తమని, కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి, రేవంత్‌ది రాతి గుండె అని హరీశ్ రావు మండిపడ్డారు. మూసీ సుందరీకరణ అంటూ రేవంత్ చేసే తుగ్లక్ చర్యలకు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. మూసీ, హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఒక రక్షణ కవచంలాగా ఉంటుందన్నారు. ఎన్ని బుల్డోజర్లు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇండ్లకు ఏమీ కానివ్వమని బాధితులకు హరీశ్ రావు భరోసా ఇచ్చారు.