Telangana: పల్లెల్లో నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్..ఒంటిగంట వరకే ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
By - Knakam Karthik |
Telangana: పల్లెల్లో నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్..ఒంటిగంట వరకే ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగనుండగా, ఈ విడతలో 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 56 లక్షల 19 వేల 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27 లక్షల 41 వేల 70 మంది పురుషులు, 28 లక్షల 78 వేల 159 మంది మహిళలు, అలాగే 201 మంది ఇతర కేటగిరీ ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు.
పోలింగ్ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా మధ్యాహ్నమే ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో 395 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ పదవుల కోసం 12,960 మంది, వార్డు సభ్యుల కోసం 65,455 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎన్నికల విధుల్లో లక్ష మందికి పైగా పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 50 వేల మందికి పైగా పోలీసులను మోహరించినట్లు డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలిపారు. 3,000కు పైగా గ్రామ పంచాయతీలలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.