ఏడేళ్లు పార్టీ కోసం పనిచేసినా.. నన్ను గుర్తించలేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ వాపోయారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, నేను ఒకే క్యాబినెట్ లో పనిచేసామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తెలంగాణ లోని అట్టడుగు, బలహీన వర్గాలకు సేవ చేయాలనే ఆలోచనతో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరుతున్నానని తెలిపారు.
హైదరాబాద్ లో నాంపల్లిలో అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై.. రెండు, మూడు రోజుల్లో బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ నన్ను గుర్తించలేదు.. అందుకే పార్టీ మారుతున్నానని వెల్లడించారు. టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ రెండు సార్లు మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా సేవలను బీఆర్ఎస్ పార్టీ వినియోగించుకోలేదని అన్నారు.
గతంలో ప్రజల మధ్య ఉన్నా.. ఇప్పుడు ఉంటా.. రాబోయే రోజుల్లోనూ ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మచ్చ లేకుండా పరిపాలిస్తుందన్నారు. మోదీ, కిషన్ రెడ్డి లు మచ్చలేని నాయకులు అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపారు.