ప్రజా సమస్యలపై శ్ర‌ద్ధ లేదు.. మంత్రులకు, సీఎంకు మ‌ధ్య‌ సమన్వయం లేదు

ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీ చార్జీ చేయడం అమానుషం.. ప్రభుత్వానికి సిగ్గు చేటు అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.

By Medi Samrat  Published on  30 May 2024 5:45 PM IST
ప్రజా సమస్యలపై శ్ర‌ద్ధ లేదు.. మంత్రులకు, సీఎంకు మ‌ధ్య‌ సమన్వయం లేదు

ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీ చార్జీ చేయడం అమానుషం.. ప్రభుత్వానికి సిగ్గు చేటు అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ హాయంలో పదేళ్లలో రైతులకు ఇలాంటి కష్టాలు రాలేదు. రైతులు అడిగిన విత్తనాలు దొరికేవి. అప్పటిలా ఇప్పుడు విత్తనాలు ఇవ్వక‌పోవ‌డానికి ఇబ్బంది ఏమిటీ? ప్రభుత్వ చేతకాని తనం వల్లే రైతులకు ఇబ్బందులు అని మండిప‌డ్డారు. రెండు మూడు రోజుల్లో రైతులు అడిగిన విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే ఆదిలాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామ‌ని అల్టిమేటం జారీ చేశారు.

సీఎం రేవంత్ అపుడు ఐపీఎల్ మ్యాచ్ లో బిజీగా ఉన్నాడు.. ఇపుడు అధికార చిహ్నాలు మారడం లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఎపుడూ రైతుల గురించి పట్టడం లేదని దుయ్య‌బ‌ట్టారు. ఉపముఖ్యమంత్రి భట్టి ఇక్కడి సమస్యలు వదిలేసి వేరే రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రైతులు ఆగమయ్యారని అన్నారు. వ్యవసాయ మంత్రి రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని అబద్దాలు మాట్లాడుతున్నారు. రైతులు మళ్ళీ కమిషన్ ఏజెంట్లను ఆశ్రయించడమే ఇందిరమ్మ రాజ్యమా.. రైతులను ఇబ్బంది పెట్టడమేనా మార్పు అంటే అని మీడియా ముఖంగా నిల‌దీశారు.

రైతు భరోసా పంటలు వేసిన తర్వాత ఇస్తామని వ్యవసాయ మంత్రి చెప్పడం సిగ్గు చేటు అన్నారు. మంత్రులకు, సీఎంకు మ‌ధ్య‌ సమన్వయం లేదన్నారు. ప్రజా సమస్యలపై సీఎంకు మంత్రులకు శ్రద్దలేదన్నారు. మంత్రి జూపల్లికి తన శాఖ లో ఏం జరుగుతుందో తెలియక పోవడం శోచనీయం అన్నారు. సీఎం రేవంత్ కేసీఆర్ ఆనవాళ్లను తొలగించడం కాదు.. రైతు సమస్యలపై దృష్టి పెట్టండని సూచించారు. సీఎంకు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ.. రైతుల బాగోగుల మీద లేదని అన్నారు.

వర్షాకాలం సాగునీటి విడుదల మీద ప్రభుత్వానికి ఓ కార్యాచరణ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 250 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ రైతుల పట్ల చూపిన శ్రద్ధలో రేవంత్ పది పైసలు పెట్టినా ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు. రైతుల సమస్యలపై సీఎం రేవంత్ ఎందుకు నోరు మెదపరు.? రైతు భరోసా ఎప్పట్నుంచి వేస్తారో సీఎం రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story