వారి జీతాలు ఎప్పుడు చెల్లిస్తారు..ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం
తెలంగాణలో హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 10:57 AM IST![Telangana, Congress Government, CM Revanth, HarishRao, Brs, Police, Home Guards Telangana, Congress Government, CM Revanth, HarishRao, Brs, Police, Home Guards](https://telugu.newsmeter.in/h-upload/2025/02/12/394572-harish.webp)
వారి జీతాలు ఎప్పుడు చెల్లిస్తారు..ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం
తెలంగాణలో హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 వేలకు పైగా హోంగార్డులకు 12 రోజులు గడుస్తున్నా.. జీతాలు చెల్లించకపోవడం సిగ్గు చేటు అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు, చేతిలో చిల్లిగవ్వ లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఈఎంఐలు చెల్లించకపోవడం కారణంగా బ్యాంకు అధికారులు ఫోన్లు చేసిన నిలదీస్తున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఎక్స్ వేదికగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్న పట్టించుకునే వారే లేరని విమర్శించారు.
మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటని సీఎం రేవంత్ రెడ్డి వీరికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు అంటూ ఎద్దేవా చేశారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన అని విమర్శించారు. హోంగార్డులకు వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు హరీష్ రావు ట్వీట్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోం గార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు…
— Harish Rao Thanneeru (@BRSHarish) February 12, 2025