కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేం : మాజీ మంత్రి హరీశ్ రావు
రానే రాదన్న తెలంగాణను కేసీఆర్ సాధించి పెట్టాడు కేసీఆర్.. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
By Medi Samrat Published on 29 March 2024 11:49 AM GMTరానే రాదన్న తెలంగాణను కేసీఆర్ సాధించి పెట్టాడు కేసీఆర్.. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చెంత ఉన్న నాయకులను కాంగ్రెస్ ఇదివరకు కూడా తీసుకెళ్లింది. కాంగ్రెస్ కొంతమంది నాయకులను కొంటుందేమోగానీ బీఆర్ఎస్ కార్యకర్తలను కొనలేదన్నారు. పార్టీ ద్వారా పదవులు పొంది ద్రోహం చేసినవాళ్లను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. సిద్దిపేట కార్యకర్తలకు ఇది పరీక్ష. నా ఎన్నిక కోసం మీరు ఎంత కష్టపడ్డారో వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం కూడా అంతే కష్టపడాలని కోరుతున్నా. నాకొచ్చినంత మెజారిటీతో ఆయనను గెలిపించాలని కోరారు.
సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్నవాళ్లు ఈ రోజు ఇక్కడికొచ్చి సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయని కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదన్నారు. 2 లక్షలు రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్‌కు ఓటు వేయండి.. కానివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయండన్నారు. యాసంగి వడ్లకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ బాండు పేపర్లు ఇచ్చింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? కారుకు ఓటేసి వాళ్లకు గుణపాఠం నేర్పాలన్నారు. ఇప్పుడు వడ్లు వస్తున్నా రైతుబంధు 15వేలు ఇంకా ఇవ్వలేదు. పదివేలు కూడా రాలేదు. 15 వేల రైతుబంధు వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు, రాని వాళ్లకు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని సూచించారు.
అవ్వాతాతలకు, బీడీ, గీత కార్మికులకు.. ఇతర పింఛనుదారులకు 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. వాళ్లందరికీ ఈ విషయం వివరించాలన్నారు. వందరోజుల్లో హామీలను అమలుచేస్తామని మాట తప్పిన కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేసి మోసపోవద్దన్నారు. సిద్దిపేటలో అభివృద్ధిని రేవంత్ అడ్డుకుంటున్నారు. నేను శాంక్షన్ చేసిన వెటర్నరీ కాలేజీని కొండంగల్‌కి తరలించాడు. శిల్పారామం, అల్లీపూర్ డబుల్ రోడ్డు పనులను మధ్యలోనే అడ్డుకొని నిధులను కొడంగల్‌కు తరలిస్తున్నాడని ఆరోపించారు. కొడంగల్‌కు నువ్వు ఏమైనా తీసుకుపో.. కానీ సిద్దిపేటకు వచ్చినవి తీసుకపోతే చూస్తూ ఉరుకోం.. సిద్దిపేట ప్రజలు కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు చేస్తారు. సిద్దిపేట మీద రేవంత్‌కు ఇంత పగ ఎందుకు? అని ప్రశ్నించారు.
కేసీఆర్ మాట తప్పని మనిషి. కల్యాణలక్ష్మి, పింఛన్లు.. ఏ హామీ విషయంలోనూ మాట తప్పలేదన్నారు. సిద్దిపేటపై బీజేపీకి ఎందుకింత ద్వేషం? రఘునందన్ దుబ్బాక నుంచి గెలిచినా.. ఎందుకు ఢిల్లీ నుంచి నిధులు తీసుకురాలేదు? ఇతనికి ఓటేయడం మన వేలితో మన కంటినే పొడుచుకోవడం. ఇతడు గెలిస్తే మనకు న్యాయం చేస్తాడా? రఘునందన్ బాగా పనిచేస్తే మొన్నటి ఎన్నికల్లో 54 వేల ఓట్ల తేడాతో ఎందుకు ఓడించిన్రు? అని ప్రశ్నించారు.
సిద్దిపేటలో ప్రతి అంగుళంపైనా అవగాహన ఉన్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి.. సిద్దిపేటలో 2 వేల డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడంలో ఆయన పాత్ర కీలకం అని అన్నారు. పేద పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నాడు. విద్యావంతుడు, కలెక్టర్‌గా పనిచేసిన ఆయనను గెలిపించుకుంటే ఢిల్లీలో మన గొంతు బలంగా వినిపిస్తాడు. నిధులు తీసుకొస్తాడన్నారు. సిద్దిపేట ఒక ఆలయంగా నేను పనిచేశాను. సిద్దిపేట ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టాలి. అప్పుడే వాళ్లకు తాము మోసం చేశామని తెలుస్తుందన్నారు. తెలంగాణ గొంతుక, ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.