రాష్ట్రంలో కరువును సృష్టించింది కాంగ్రెస్ పార్టీనే : కేసీఆర్
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 31 March 2024 2:43 PM GMTబీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆదివారం నిర్వహించిన పొలం బాటలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. వంద రోజుల్లోనే తెలంగాణ అస్తవ్యస్తంగా తయారైందని, ఈ వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు కేసీఆర్. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలు ఎదుర్కొంటున్న కరువును అసమర్థ, అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదన్నారు. విద్యుత్, తాగునీరు, సాగునీరు ఎలా నిర్వహించాలో రేవంత్‌రెడ్డికి తెలియదని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో 'పొలం బాట' కార్యక్రమం కింద జనగాం, యాదాద్రి, సూర్యాపేటలో ఎండిన వరి పొలాలను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. రైతు బంద్ కింద నీటిపారుదల, నాణ్యమైన విద్యుత్, ఆర్థిక ఇన్‌పుట్‌ను అందించడంలో కాంగ్రెస్ కనీసం ముందుకు వెళ్లలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి రైతులు సాగుకు పెట్టుబడి పెట్టారని, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో సర్వం కోల్పోయారని కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించిందని తెలిపారు. “BRS వివిధ మార్గాల ద్వారా సాగునీరు అందించింది. రైతుబంధు ద్వారా సకాలంలో ఆర్థిక సాయం చేశాం.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశాం, 7,600 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం, రైతు బీమా ద్వారా భద్రత కల్పించాం’’ అని కేసీఆర్ గుర్తు చేశారు.