భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో వైఎస్సార్టీపీ నేత ఏపూరి సోమన్న భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమ కారుడుగా గుర్తింపు పొందిన ఏపూరి సోమన్న త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఏపూరి సోమన్న నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. ఈ భేటీలో టీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.
వైఎస్సార్టీపీ ప్రారంభం నుంచి షర్మిల వెంట తిరిగారు ఏపూరి సోమన్న. అయితే షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధపడటంతో పార్టీలోని పలువురు నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. వారిలో ఏపూరి సోమన్న కూడా ఉన్నారు. ఏపూరి సోమన్న తుంగతుర్తి టికెట్ హామీతో వైఎస్సార్టీపీలో చేరారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా.. ఆ పార్టీ తుంగతుర్తి టికెట్ ఇప్పించండనే ప్రతిపాదనను కూడా షర్మిల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. తొలి నుంచి కేసీఆర్‌కు వ్యతిరేకంగా గళం వినిపించిన ఏపూరి సోమన్న.. అనూహ్యంగా కేటీఆర్‌తో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది.