మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడొద్దు: కేసీఆర్
బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 15 Oct 2023 12:49 PM ISTమళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడొద్దు: కేసీఆర్
బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ''ఇవాళ రెండు కార్యక్రమాలు ఉన్నాయి. హుస్నాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. సమయానికి అన్ని జరిగిపోయేలా ముగించుకుందాం. మీ అందరికీ చాలా సందర్భాల్లో, చాలా సమావేశాల్లో పదే పదే ఒక మాట చెప్పాను. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు వస్తాయి, విజయం సాధిస్తారని ఆత్మవిశ్వాసం ప్రకటించాను. మీ అందరికీ అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఎవరికైతే అవకాశం రాలేదో.. వారు తొందరపడాల్సిన అవసరం లేదు. మళ్లీ విజయం మనదే'' అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థిగా సెలెక్ట్ అవ్వడమే ఫైనల్ కాదని, ఎన్నో అవకాశాలు ఉంటాయన్నారు. అభ్యర్థులను మార్చుకున్న చోట విచిత్రమైన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. వేములవాడలో అభ్యర్థిని మార్చుకోవాల్సిన అవసరం లేదని, కానీ అక్కడ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టే అభ్యర్థిని మార్చుకోవాల్సి వచ్చింది అని కేసీఆర్ తెలిపారు. అభ్యర్థులు కోపాలు తీసేసుకోవాలన్నారు. చిన్న కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. అభ్యర్థులకు సంస్కారం ఉండాలని, ప్రజలకు దండం పెట్టి ఓటు కావాలని అడుగుతామని, రాజకీయాలు అన్న తర్వాత మంచి, చెడు ఉంటాయన్నారు.
సామరస్యపూర్వకంగా సీట్లను సర్దుబాటు చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి కార్యకర్తతో నేతలు మాట్లాడాలని కేసీఆర్ సూచించారు. ఎన్నికల ఘట్టంలో చాలా కీలకంగా వ్యవహరించాలన్నారు. సాంకేతికంగా దెబ్బతీయాలని కొందరు చూస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు. బీ-ఫారాలు నింపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
''ఎన్నికలు వచ్చినప్పుడల్లా తమాషాలు చూస్తుంటాం. ఎన్నికల్లో నిబంధనలు మారుస్తుంటారు. ప్రతిది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మాకు తెలుసులే అని అనుకోవద్దు. 98480 23175 నంబర్‌కు ఫోన్ చేస్తే భరత్ కుమార్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. మన పార్టీకి, ఎన్నికల కమిషన్‌కు మధ్య వారధిగా భరత్ కుమార్ పని చేస్తున్నారు. అభ్యర్థులకు సందేహాలు వస్తే ఒక్క ఫోన్ కొడితే నిమిషాల్లోనే పరిష్కారం చూపిస్తారు. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. చివరి రోజున నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించొద్దు. ఇవాళ 51 బీ-ఫారాలు తయారు చేశాం. మిగతా బీ-ఫారాలు రెడీ అవుతున్నాయి'' అని కేసీఆర్ అన్నారు.
అంతకుముందు తెలంగాణ భవన్‌లోని జయశంకర్ సార్ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.