సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మండల పరిధిలోని మనియార్ పల్లి, బిలాల్‌పూర్, గోటిగార్ పల్లి గ్రామాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిప్డారు. స్థానిక ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూమిలో నుంచి భారీగా శబ్దాలు వచ్చాయి. వింత శబ్దాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారని గ్రామస్తులు చెప్పారు. భూ ప్రకంపనలు వచ్చిన సమయంలో ఏం జరుగుతుందో తెలియన స్థానికులు భయపడ్డారు.
నిన్న శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇచ్చాపురం నియోజకవర్గంలోని ప్రజలు రాత్రంతా ఏం జరుగుతుందో అర్థంకాక కంటిమీద కునుకు లేకుండా చలిలోనే వీధుల్లో చంటిబిడ్డలతో జాగారం చేశారు. వారం రోజుల వ్యవధిలో రెండో సారి ప్రకపంనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి 10.15 గంటల సమయంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇచ్చాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని రత్తకర్ణ, తేలుకుంచి, అమీన్‌సాహిబ్ పేట, పురుషోత్తపురం గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.