అది బీఆర్ఎస్ చేసిన ప్రయత్నమే..!
హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి, హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్‌కు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడం గత BRS ప్రభుత్వ విజయంగా..
By Medi Samrat Published on 2 March 2024 3:30 PM GMTహైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి, హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్‌కు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడం గత BRS ప్రభుత్వ విజయంగా.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KT రామారావు (KTR) అభివర్ణించారు. ఒక దశాబ్దం పాటు తాము పోరాడామని తెలిపారు. ‘‘తెలంగాణలో మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్ల కోసం పోరాడాం. ఈ ప్రాజెక్టులపై మా ప్రభుత్వం 31 జూలై 2023న నిర్ణయం తీసుకుంది. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది,” అని ఆయన చెప్పారు.
రక్షణ శాఖ 33 ఎకరాల రక్షణ భూములను కేటాయించిందని, ఇప్పుడు ఈ స్కైవేల నిర్మాణానికి మరో 150 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు. రక్షణ భూముల గుండా వెళుతున్నందున గత ప్రభుత్వాలు ఈ రహదారులను విస్తరించలేకపోయాయని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఎలివేటెడ్ కారిడార్ల కోసం ప్రతిపాదనలు సమర్పించిందని, దీనిపై పోరాటాన్ని నిర్విరామంగా కొనసాగించిందని కేటీఆర్ తెలిపారు. ‘‘అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు సంబంధిత మంత్రిత్వ శాఖలను కలిసారని.. ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. అంతా బాగానే ఉందని, త్వరలోనే ఫైళ్లను ఆమోదిస్తామని హామీ ఇచ్చేవారు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని పత్రాలను కూడా సమర్పించాం’’ అని కేటీఆర్ తెలిపారు. ఈ ఎలివేటెడ్ కారిడార్‌ల ఆమోదం కోసం కృషి చేసిన ప్రభుత్వ అధికారులను అభినందిస్తూ, ఈ కారిడార్లు పూర్తయితే చాలా వరకు ట్రాఫిక్ క్లియర్ అవుతుందని.. కీలకమైన రెండు రహదారులపై ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని కేటీఆర్ అన్నారు. రక్షణ భూములను మంజూరు చేయడం ద్వారా కారిడార్‌లను ఆమోదించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.